Friday, January 13, 2017

సంక్రాంతి పండగ



తెల్లవారకముందే నిద్రలేవడం...భోగి మంటలు...అమ్మమ్మ అమ్మ వాళ్ళుఇంటి ముందర కళ్ళాపి చల్లి, బియ్యప్పిండితో ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి బంతిపూలు, మందారంపూలతో అలంకరించి...హరిదాసు వస్తే జోలె నిండుగా చిన్న పిల్లలతో ధాన్యం వేయించి దీవెనలిప్పించి...బసవన్న వస్తే గంగిరెద్దు విన్యాసాలకు ధర్మం చేసి... గుమ్మడికాయ పులుసు, నువ్వుల పచ్చడితో కడుపునిండుగా భోజనం చేసి అరిగిపోయే దాకా ఆడుకొని...మధ్యలో నానమ్మ వాళ్ళకు తెలియకుండా వెళ్ళి దాచిపెట్టిన అరిసెలు సకినాలు చక్కిలాలు మురుకులు కారప్పుసా జేబుల్లో నింపుకుని తోటి పిల్లలకు ఇవ్వకుండా దొంగతనంగా తినేసి... గాలిపటాలు ఎగరేసి...సాయంత్రం టికెట్టు దొరికితే కొత్త సినిమా చూసేసి, లేకపోతే అమ్మ కొంగు పట్టుకుని భోగి పేరంటాల్లో శనగలు గుగ్గిళ్ళు తింటూ రేగుపళ్ళూ, చెఱుకు ముక్కలు కొత్తబట్టల జేబుల్లో నింపేసుకుని తాతయ్య చెప్పే నీతి కథలు వింటూ నిద్రపోవడం...

ఇదంతా ఒకప్పటి సంక్రాంతి సంబరాలు...

 ఇప్పుడా... పదైతే కానీ మెళకువ రాదు! బధ్ధకం! అపార్టుమెంటులో రెండు పెగ్గులేయటానికి ఎవడైనా ఓకే ముగ్గులేస్తే టైల్స్  పాడైపోతాయనే దౌర్భాగ్యం! కంప్యూటర్లో గీసేసీ, ఫేసుబుక్కులో ఇన్స్టాగ్రాములో పెట్టేయ్డమే! ధాన్యమే కరువైతే ఇక హరిదాసు ఎక్కద్డినుంచి వస్తాడు? బిర్యానీలో మాంసం అయిపోతున్న బసవన్నవిన్యాసం ఏం చేస్తాడు? పీజాలు బర్గర్లతో కడుపు నింపుకుని, అరిగేదాకా సామాజిక మాధ్యమాలల్లో ఏదో ఒక పెంట చేసేసి, టికెట్టు దొరికితే థియేటర్లో లేకపోతే పైరసీ ప్రింట్లో ఇంట్లో సినిమా చూసేసి...మళ్లీ రేపు ఉద్యోగానికెళ్ళాలన్న బాధతో నిద్రపట్టక గింజుకోవడం... ఇప్పటి సంక్రాంతి ... 

ఆ పాత మధురాలని నెమరేసుకుంటూ... మనిషిలా జీవించే భాగ్యం ఈ సారైనా దొరకాలని కోరుకుంటూ...

మకర సంక్రాంతి శుభాకాంక్షలు     

నాగతేజ